Wednesday, November 28, 2007

వెన్నెల మంటలు!



పున్నమి రేయి వెన్నెలలా
వెన్నెల రేయి జాబిలిలా
జాబిలి పోలిన ప్రియునిలా
ప్రియుని కన్నుల ప్రేమలా
ప్రేమను పంచే హృదయంలా
హృదయం పలికే రాగంలా
రాగంలా...అనురాగంలా
పెనవేసుకున్న బంధంలా
అనిపించావని అడిగానిలా..
ప్రియా! ఎవరవు నీవు? నాకేమవుతావని!
నీ మనసుకి భావన నేనవుతానన్నావు
నిజమని నమ్మి నే చెంత చేరితే
చివురించిన ఆశలన్నీ చిదిమేసి
చేరువైన చెలిమిని క్షణకాలంలో మాపేసి
భారమైన కాలాన్ని బహుమతిగా ఇస్తూ
చెలి గుండెలలో చితి మంటలు రేపావు
!

Sunday, November 18, 2007

మార్పు!



నేను!
ఎంతో...మారాను!
నా జాడే నాకు తెలియనంతగా
నా నీడ సైతం నువ్వైనంతగా
నా గుండె చప్పుడే నీ పేరైనంతగా
నా కంటిపాపే నీ రూపైనంతగా
నా ఊహ సైతం నిను వీడనంతగా
నా ఊపిరి సైతం నువ్వైనంతగా
అణువణువు నువు నిండినంతగా
అసలు నేనే నువ్వైనంతగా !

నువ్వు!
నువ్వూ...మారావు!
నా ఊహకి సైతం అందనంతగా
నా ఉనికిని సైతం మరిచినంతగా
నా ఊసే నీ ఎదలో లేనంతగా
నా ఆశలన్నీ కూల్చేంతగా
నా పిలుపు సైతం వినలేనంతగా
నా ప్రేమను సైతం కనలేనంతగా
అసలేమీ జరగనట్టుగా
నేనంటూ అసలు లేనే లేనట్టుగా!

నాలో ఈ మార్పుకి కారణం
నా మది నీపై పెంచుకున్న అంతులేని మమకారం!

మరి నీలో మార్పుకి కారణం......??
అది బదులు దొరకని ఒక ప్రశ్నకి ప్రాకారం!

Tuesday, November 6, 2007

కన్నీటి స్నేహం~కాలంతో పయనం


ఎదురవుతావన్న ఆశ లేదు
ఎదురీతకి దారి లేదు
ఎదురించే శక్తీ లేదు
ఎద భారం చేసిన ప్రేమ మాత్రం మిగిలే వుంది
ఎదురుచూపులోనే యుగాలు గడిపేస్తోంది
ఏ తోడూ అందిరాక
ఎడబాటుకే బంధువై
ఏ నీడా కానరాక
ఎండమావికి చేరువై
గుండెకోత మిత్రునితో
కన్నీటి స్నేహం చేస్తూ
కాలంతో కలిసి పయనిస్తోంది