Wednesday, November 28, 2007

వెన్నెల మంటలు!



పున్నమి రేయి వెన్నెలలా
వెన్నెల రేయి జాబిలిలా
జాబిలి పోలిన ప్రియునిలా
ప్రియుని కన్నుల ప్రేమలా
ప్రేమను పంచే హృదయంలా
హృదయం పలికే రాగంలా
రాగంలా...అనురాగంలా
పెనవేసుకున్న బంధంలా
అనిపించావని అడిగానిలా..
ప్రియా! ఎవరవు నీవు? నాకేమవుతావని!
నీ మనసుకి భావన నేనవుతానన్నావు
నిజమని నమ్మి నే చెంత చేరితే
చివురించిన ఆశలన్నీ చిదిమేసి
చేరువైన చెలిమిని క్షణకాలంలో మాపేసి
భారమైన కాలాన్ని బహుమతిగా ఇస్తూ
చెలి గుండెలలో చితి మంటలు రేపావు
!

Sunday, November 18, 2007

మార్పు!



నేను!
ఎంతో...మారాను!
నా జాడే నాకు తెలియనంతగా
నా నీడ సైతం నువ్వైనంతగా
నా గుండె చప్పుడే నీ పేరైనంతగా
నా కంటిపాపే నీ రూపైనంతగా
నా ఊహ సైతం నిను వీడనంతగా
నా ఊపిరి సైతం నువ్వైనంతగా
అణువణువు నువు నిండినంతగా
అసలు నేనే నువ్వైనంతగా !

నువ్వు!
నువ్వూ...మారావు!
నా ఊహకి సైతం అందనంతగా
నా ఉనికిని సైతం మరిచినంతగా
నా ఊసే నీ ఎదలో లేనంతగా
నా ఆశలన్నీ కూల్చేంతగా
నా పిలుపు సైతం వినలేనంతగా
నా ప్రేమను సైతం కనలేనంతగా
అసలేమీ జరగనట్టుగా
నేనంటూ అసలు లేనే లేనట్టుగా!

నాలో ఈ మార్పుకి కారణం
నా మది నీపై పెంచుకున్న అంతులేని మమకారం!

మరి నీలో మార్పుకి కారణం......??
అది బదులు దొరకని ఒక ప్రశ్నకి ప్రాకారం!

Tuesday, November 6, 2007

కన్నీటి స్నేహం~కాలంతో పయనం


ఎదురవుతావన్న ఆశ లేదు
ఎదురీతకి దారి లేదు
ఎదురించే శక్తీ లేదు
ఎద భారం చేసిన ప్రేమ మాత్రం మిగిలే వుంది
ఎదురుచూపులోనే యుగాలు గడిపేస్తోంది
ఏ తోడూ అందిరాక
ఎడబాటుకే బంధువై
ఏ నీడా కానరాక
ఎండమావికి చేరువై
గుండెకోత మిత్రునితో
కన్నీటి స్నేహం చేస్తూ
కాలంతో కలిసి పయనిస్తోంది

Wednesday, October 3, 2007

అందాల నా కల!


వెన్నెల్లో గోదారిలా
ఎగసిపడే సంద్రపు అలలా
వచ్చిందో అందమైన కల!
అందులో నువ్వు నా ప్రియుడిలా
పట్టితెచ్చావు పండు వెన్నెల!
కానుకిచ్చావు గుండె నిండేలా
కరిగిపోయింది నా మది వెన్నలా
దోచుకెళ్ళావు వెన్న దొంగలా
దాచుకున్నావు నీ ఎదలోపల
కొలువుండమన్నావు కలకాలమిలా
ఒదిగాను నీ గుండెలో గువ్వలా
మురిశాను నీ ప్రియభామినిలా
చేరువయ్యాము చిలకా~గోరింకల్లా!
తూరుపు తెర తీసిందలా
కరిగిపోయింది నా కమ్మని కల!

Tuesday, September 18, 2007

తిరిగొచ్చిన తిమిరం



ఉషస్సుతో వచ్చావు
మనస్సులో నిలిచావు
ఆశలెన్నో రేపావు
నా ప్రతీ శ్వాశలోనూ చేరావు
ఊసులెన్నో చెప్పావు
నా ఊహలకు ఊపిరిని పోసావు
బాసలెన్నో చేశావు
బంధమేదో కలిపావు
బాధలన్నీ మరచి
నీ ఎదపై తలవాల్చి
సేదదీరమన్నావు
భారం తీర్చుకునే వేళకి మాత్రం
దూరంగా వెళ్ళిపోయావు
తిరిగి మదిలో తిమిరం నింపావు

Tuesday, July 31, 2007

మేఘ సందేశం


నీవు లేని ఏకాంతంలో
నిదురే రాని నిశి రాతిరిలో
కదలిక మరచిన కాలంతో
బదులు పలకని శూన్యంతో
అలుపెరగని తలపులతో
అల్లరి చేసే ఊహలతో
చేస్తోంది మనసు సమరం
చేరలేక నీ హృదయ ద్వారం
పంపాను మేఘాలతో సందేశం
మన్నించి దరిచేరవా నేస్తం!

Monday, July 9, 2007

ఏకాకి మనసు


ఏకాకిగా మారిన మనసు
ఎన్నాళ్ళని చేయను తపస్సు
నీకై ఎదురు చూస్తోందని
నీకూ...తెలుసు
ఐనా తగునా నీకింత అలుసు?
ఆవిరైపోదా సొగసు?
మనకై ఆగుతుందా ఈ వయసు?

Wednesday, May 30, 2007

నీ జ్ఞాపకాలు

నీతో గడిపిన ఆ మధుర క్షణాలు
నను నేనే మరచిన ఎన్నో వైనాలు
మదిని మురిపించిన ఆ తీయని మాటలు
ఎదను మీటిన మరెన్నో భావనలు
నీ తలపులతోనే గడిపిన ఎన్నో రాత్రులు
ఒట్టి ఊహలుగానే ఉండిపొమ్మంటూ
కలవర పెట్టిన ఆ కఠినమైన నిజాలు
మౌనంగా పారాయి నా కంట కన్నీరు
సాక్ష్యం గా నిలిచాయి నా నయనాలు
నిదురకు దూరం చేశాయి నీ జ్ఞాపకాలు!

Tuesday, May 22, 2007

గుప్పెడంత గుండెలో..


గుప్పెడంత గుండెలో
గూడుకట్టుకున్న ఆశలెన్నిటినో
గుప్పిట్లోనే బిగియించి
మది నిండిన నీ ఆలోచనలను
గది లోపలే బందించి
మరపుకైనా రాని జ్ఞాపకాల్ని
మౌనంగానే భరిస్తూ
ఎదలోపలి భావాలను
వ్యధగానే మిగిలిపొమ్మంటూ
విధి చేసిన శాసనానికి
తలవొగ్గి
గుండె గాయమైనా
బ్రతుకు భారమైనా
పెదాలపై మాత్రం
చిరునవ్వు చెదరనివ్వక
ప్రతి క్షణం నీ తలపులతోనే
చివరి క్షణం కోసం ఎదురు చూస్తూవున్నా!

Friday, May 4, 2007

పరుగాపని వయసు ~ దరిచేరని మనసు!


వసంతాలు దాటేస్తోంది వయసు
వెంట రమ్మంటె రానన్నది మనసు
కాలంతో పాటు పరుగెడుతోంది వయసు
ఆ కాలంతో నిమిత్తం లేదంది మనసు
బ్రతుకు తీరాలు దాటేస్తోంది వయసు
బతిమాలినా వెంటరానన్నది మనసు
దేహాన్ని కరిగించేస్తోంది వయసు
ఇంకా దాహం తీరలేదంటోంది మనసు
బంధాలు తనని ఆపలేవంది వయసు
అనుబంధంతోనే ముడిపడిపోయింది మనసు
మృత్యువు వైపు నడిపిస్తోంది వయసు
గమ్యం చేరలేక విలపిస్తోంది మనసు
రేయనక పగలనక పరుగెడుతోంది వయసు
రేయింబవళ్ళు నీకై ఎదురు చూస్తోంది మనసు
క్షణమాగక పయనిస్తోంది వయసు
నీ ఎద వాకిటనే నిలిచిపోయింది నా మనసు
పరుగాపని వయసు దరిచేరని మనసు!